Saturday, April 25, 2009

మేమూ మా బాపు గారు


పదకొండేళ్ళ కిందటి వుత్తరం లొని ముక్కలివి "బాపు గారు నాకు బొమ్మలేం వద్దు, మీదగ్గర్నుంచి ఒక్క ఉత్తరం ముక్క , ఈ జన్మ కింత చాలు.(ఇలా రాస్తానా మీ Reply వస్తుందా, మళ్ళీ ఇంకొటి రాస్తానా మళ్ళీ Reply ఇమ్మంటానా, ఇంకంతే , ఇది అంతు లేని కథ")

అనుకున్నంతా అయింది, ఊహించిందే జరిగింది వొక బండ మొండి వాడు కొట్లాది మంది అరాధ్య చిత్రకారున్ని, తెలుగు రాతకు, గీతకు, వర్ణానికి దారి, దిక్కు ఐనవాడిని, తెలుగు చిత్రకళ కు ముందు, వెనుక వాడిని, హద్దులు లేని చిత్కళ హద్దుల అంతం చూసిన వాడిని, ఒఖ్ఖ తెలుగులొనే కాదు, భారత దేశం మొత్తానికే కాదు, ప్రపంచ చిత్రకళా రంగంలొ బాపుగారంత విస్త్రుతంగా వైరుధ్యంగా బొమ్మలు గీయగలిగిన వారు మరొక్కరు లేరన్నంత బాపు గారి లాంటి వాణ్ణి.

ఒకటా రెండా ఎన్ని ఆగడాలని చెప్పను , ఎంత అవివేకమని ఒప్పుకొను, ఆయన పుస్తకాలు కొట్ట్టేశా, డబ్బులు కాజేశా, సినెమా సీడీ లు, బొమ్మల వొరిజినల్లు, వాటి తాలూకూ Sketch లు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మా పిల్లవాడి పేరిట పూతరెకులు, జీడి పాకాలు, నా నోటికి ఆలూ బొండాలు, అయన చేతి Coffee లు..............నిన్నటికి మొన్న ఇదిగొ ఇలా Family portraits కూడా.

నాకు మంచి మర్యాద తెలీవు, మీరు కొత్తగా కనిపెట్టనఖ్ఖర్లె మాకు ముందె తెలుసు, పద్దతి పాడు లెవు ఇదీ మీరు చెప్పనక్కర లేదు, అదీ తెలుసు, పెద్దల పట్ల వినయం వందనం దణ్ణం, లెఖ్ఖా జమా జాన్తానై. ఐనా मेरे पास బాపు గారు है! ఆయన చల్లని చూపు है! కొండంత ప్రేమ है! తెలుగు జన్మ ఎత్తి తెలుగు బ్రతుకు బ్రతుకుతున్న వాడికి ఇంతకన్న ఏమి కావాలి है?