Monday, October 25, 2010

అతడు భూరిప్రతాప..........

మీకు సన్మానం  చేస్తాం గుంటూర్రండి సార్ అట్లాగే  మా గుంటూరు చూద్దురుగాని "అన్నారు ఒకరు (గుంటూర్లొ ఏం చూస్తాం?)
మా వాడి పెళ్ళి గుంటూర్లొ మీరు తప్పకుండా రావాలి   పన్లొ పని  గుంటూరు  ఎప్పుదు చూల్లేదు అన్నారుగా చూద్దురుగాని" అన్నారు ఇంకొకరు  ( ఏం చూస్తాం గుంటూర్లొ?)

కాని....గుంటూరెల్లాలి తప్పకుండా వెల్లాలి, వాడు అక్కడే వుంటాడు ,ఎక్కడికీ  తప్పించుకు పొలేడు, వాడు 'పాండు '

ఎస్సెమ్మెస్సులకు దొరకని పాండు,  మొబైల్ మాటలకు అందని పాండు,  సంవత్సరానికి   365 రొజులు నన్ను ద్వేషించిన పాండు, శపించిన పాండు " రంజానుకు మా ఇంటికి భొజనానికి రా గురూ" అంటూ బాగ్ లింగంపల్లి మెయిన్  రోడ్ కుడిపక్కనుంచి నే పొన్ చేస్తే బాగ్ లింగంపల్లి మెయిన్  రోడ్ ఎడంపక్కనుంచి  "నే వారం రొజులుగా వినుకొండలొ వున్నా గురు,  ఆ రంజాన్ ఏదొ అయ్యాక గాని వూర్లొకి రానన్న బొంకుల పాండు , బొంకడానికి వీల్లేకుండా గుంటూరు లొ వున్నాడు, అక్కడే వుంటాడు ఇక ఎక్కడికీ తప్పించుకు పొలేడు,  పాండు చచ్చి పొయాడు.

ఎంత దారుణమైన  వాక్యం ఇది  వ్రాయక వ్రాయక పాండు మీద వ్రాస్తే ఇట్లాగా వ్రాయడం ?? 
నతడు  భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు వీడు అనగా  ఈ పాండు( తిక్కన వారి  విరాట పర్వంలొనిదీ పద్యం "దీనిపై సకల హక్కులూ నావేరా కుయ్యాస్:  అనేంత వోన్ చేసుకున్నాడు  బాపు, చంద్ర, మొహన్ గార్ల  ప్రస్తావన వొచ్చినప్పుడల్లా ఈ పద్యం పాడేవాడు, నేను వినలేదు గాని  చిత్రకారుడు హంపి గురించి కూడా ఎప్పుడొవొకప్పుడు దీన్ని పాడేవుంటాడు , హంపి అంటే చెప్పనలవిగానంత ప్రేమ వుందేది పాండూకి)  వీడిని చూడండి, వీడి పనితనాన్ని చూడండి నీలం, నలుపు ,ఎరుపు,  తెలుపు వర్ణాలక్కిన వీడి దేవతామూర్తులను చూడండి వారి వెనుక పొందిగ్గా అల్లించిన ఆ హొయసాల శైలింబొలిన అల్లికల పల్లవులం చూడండి అని కదా వ్రాయాల్సింది,  లక్షలకు అమ్ముడుబొయిన వీడి చిత్రరాజాల్ని చూడండి అనికదా బొబ్బరించాల్సింది, వీడి చిత్రకళా కీర్తి  దేశ విదేశ దిగంతాలకు పాకింది చూడండి  అనికదా కుళ్ళి కుళ్ళి కుళ్ళు వ్రాతలు వ్రాయల్సింది, అట్లా గాక ప్రముఖ చిత్రకారుడు పాండు రామంతపూర్ లొ గురువారం నాడు తనదైన సన్న చిరునవ్వుతొ, సన్నని బంగారు వేల్లను గుండెలకానించి నిద్దర్లొనే మరణించారు అనే అన్యాయపు  రాతలా వ్రాయడం!!

అనగనగనగా మోహన్స్  స్కూల్ ఆఫ్ థాట్స్ అనే గదుండేది, లొపలికెల్తే లేత బూడిదరంగు గొడల మధ్య ముదురు బూడిద రంగు కుర్చీ బల్లల మధ్య కొంతమంది ముదురు మనుష్యులు_  వాళ్ళళ్ళో   వీర ముదురు  పాండు , ముదురు ఎక్కడ అంటే బ్రతకడంలొ కాదు బ్రతకలేక పొవడంలొ,కళొ కళొ అని వెర్రి కేకలు పెట్టడంలొ, మా వాష్ టెక్నిక్ హనుమంతరావనొ, జార్జ్ సూరట్నొ, దేవి ప్రసాద్ రాయి చౌదరనొ, మానేట్నొ, అశిష్ కుమార్ హల్దార్నొ తన మాటల్లొ లాక్కొచ్చి లెక్చర్ల మీద లెక్చర్ల్ పీకడంలొ, అ మీదట మాట  మాటకి మధ్య అన్నమయ్యని, త్యాగరాజుని, పొతన, తిక్కన,  శ్రీనాధ ఇత్యాదుల రచనలని మిక్స్ చేస్తూ.అదీ మామూలుగంగి గొవు బిడ్డల్లంటి మాలాటి దూడలతొనే కాదూ కళని కబుర్లని  అమాంతం అరిగించుకుని కరిగించుకున్న మొహన్ గారి ముందు మఠం వేసుక్కూచూని,  చొక్కా చేతులు పైకి లాక్కూని,  సిగరెటు దమ్ము బిగించి వదిలి " ఇదిగొ మొహన్ గారు అసలు ఆర్ట్ అంటే తెలుసా మీకు అని మొదలెట్టేవాడు.

ఆ రొజుల్లొ నీలొఫర్ హస్పిటల్ సర్కిల్లొని ఇరాని చాయి షాపుల టేబుల్లన్ని పాడూ స్కెచ్ బుక్కులే , గ్రానెట్ రాయి కాన్వాస్ పై పెన్సిల్  గ్రాఫెట్ గీతలు వజ్రపుదారులేసేవి. పెన్సిల్  మరిచిన రొజు గ్లాస్ లొని మురికి నీళ్ళతొ  మంచి   బొమ్మలు రాల్చేవాడు.  పాండు ఎంతటి హర్రర్ సినెమా అంటే సాటితోటి చిత్రకారులు బొమ్మలు గీసి గీయక  పెన్సిల్ ముక్కలు అరగ్గొట్టడానికే నానా యాతన పడుతుంటే  వీడు మాత్రం బొమ్మలు గీసీ గీసీ పెన్సిల్ తొ బాటు చూపుదువేలు కూడా అరగదీశాడు.   తుపాకి పుచ్చుకుని ఖైదీల ముందుప్రదర్శించే నాజి సొల్జర్ తుపాకి మాదిరి  ఆ వేలు మా ముందు చూపించుకు  తిరిగేవాడు " ఇంతలా వేళ్ళరిగినా  బొమ్మలబ్బట్లేదు, ఏం అరగకుందానే మీకెట్లా అబ్బుతాయిరా కుంకల్లారా" అని హూంకరించేవాడు. మేము మా అరగని వేలు పాండూ వైపు వాడి అరిగిన వేలు వైపు ఈర్షగా.

పాండూకు  తలతిక్క , నాదీ తలతిక్కే " మహాను భావునుడైన నాకు, బొమ్మలొచ్చిన నాకు, పద్య సాహిత్యాన్ని పర పర పలికే నాకు, వినుకొండ  హనుమతరావుగారి శిష్యుడైన నాకు , నా అంతటి నేనైన నాకు అహంకారం ఒక అలంకారం , పొట్ట కొస్తే పిట్ట బొమ్మ రాదు నీకు అహంకారమేనా ? ఎందుకు బే ? అనేవాడు , "రాయల సీమ కారం తిని బే అని సమాధానం ఇచ్చే వాన్ని", ఇంతొటి తలపొగురు వున్నవాన్ని  ఎవరూ మెచ్చనట్టే పాండూ నన్ను మెచ్చలేదు.



అయినా విధి బలీయమన్నట్టు బషీర్ బాగ్ సెంటర్లొ ఇరుగు పొరుగు పత్రికలు సుప్రభాతం , మాభూమి లొ ఒకే సమయంలొ కాపురాలు వెలగ బెట్టాం,  నాది బొమ్మల్లొ నాటు కొట్టుడు..  చేతికొచ్చిన బొమ్మను చేతికందిన పేపర్  మీద్ వొలక బొయడమే నా ప్రగ్ణ, పాండు అట్లా కాదు పద్దతిగా బొమ్మలు నేర్చిన వాడు , జె ఎన్ టీ యు గదుల్లొ పెయింటింగ్ చేసినవాడు , ప్రిస్టన్ బ్లెయిర్ ఇత్యాదుల అనిమేషన్ పాఠాలు  పట్టి ఆనిమేషన్ చేసిన వాడు, పెయింటింగ్ కాని పాకెట్ కార్టూన్ కాని పూజ చేసినంత శాస్త్రొక్తంగా పని కానిచ్చేవాడు , వూదుబత్తి వెలిగించినంత భక్తిగా సిగరెట్టు ముట్టిచ్చి కుంచె అంచు కాల్చేవాడు, కీలెరిగి వాతెడితేనే బ్రషు పలుకుద్ది గురూ అనే వాడు " మరి నాకు సిగరెట్టు అలవాటు లేదుగా నేను దేంతొకాల్చాలి?" అనడుగుతే నాకేసి  అసియ్యంగా చూస్తూ   " వాత పెట్టాల్సింది నీ బ్రష్ కు కాదు రా నీకు" అనేవాడు, పొస్టర్ కలర్స్ తొ అద్భుతాలు అద్ది  ఇలస్త్రెషన్లు  , పుస్తకాల కవర్లు  గీశాడు,  ముందుగా పేపర్ ని నీళ్ళల్లొ నాన పెట్టి ఆ పై ఎండ పెట్టి, నేల పై పరుండ పెట్టి , డ్రాయింగ్ బోర్దు పై వొత్త బెట్టి , దాని పై టేపు అతకభెట్టి  నంత పనిచేసి కళా ఖండాలు లాగేవాడు.


వీడికి బ్రతుకు సీరియస్ కాదు, రొజు గడవడ మన్నది సీరియస్ కాదు, కంచం సీరియస్ కాదు, మంచం మాత్రం మస్ట్ అనేవాడు, గొలుసు కట్టు సిగరెట్టు మాత్రం కూడా మస్టేనని నాకనిపించేది .....  ఉద్యొగాలు చేశాడు గాని అవి బొత్తిగా సీరియస్ కావు,  కంగాళీ పడి కష్టం పడి వచ్చిన ఉద్యొగాల్ని ఎడంకాలితొ జరిపి ఈజీగా వొదిలేసేవాడు ,ఎడిట్రుగారు కాని,షాపు వొనరు గారు కాని , చీప్గాని, సబ్బు గాని ఎవ్వొరుని లెక్క వుందేది కాదు "మనది సమ్యక్ ద్రుష్టి   గురు" అని వంకర నవ్వేవాడు. 


చివరిగా ఆఖరిగా ఇద్దరం కలిసి అంధ్ర ప్రభలొ చేరాం, బొమ్మలేశాం, 15000 ల రూపాయల నొట్ల బొత్తి వొడిసి పట్టి ఆర్టు డైరెట్రు శ్రీరాం ని కూడా వెంట బెట్టి హైద్రాబాదు ఆర్టు షాపుల మీద అటాక్ చేశాం ఆక్రిలిక్కులు , ఆర్ట్ పేపర్లు , చార్కోళ్ళు చాటడెంత పేలెట్లు,  బ్రషులు, పెన్సిల్లు రంగులు...... ఆపీసు నిండా మా హంగులు.. పట్టుమని పది రొజులు కూడా లేడు మళ్ళీ ఉద్యొగం మానేశాడు ఈసారి నా మీది కొపంతొ.  ఇక జన్మలొ ఉద్యొగం చేయనన్నాడు, ఈ ఆర్టిస్టు నా పుత్రులతొ స్నేహం వద్దే వద్దన్నాడు, ఈసారి పెయింటింగ్ చేయి పట్టుకున్నాడు దీన్నిక వొదిలేది లేదని అందరికి అర్ధమయినంత గట్టిగా. ఇదంతా 2004 లొ ఆ తరువాత సంవత్సరానికి వొకటీ రెండుసార్లు ఎక్కడొతగిలేవాడు,  పెద్దగా తగలనిచ్చే వాడుకాదు, అయినా న్యూస్ తెలిసేది " పాండు బొమ్మ గీస్తే  లక్ష, గీస్తానని మాట ఇచ్చినా లక్షేనని. వొ మధ్యలొ చిక్కడపల్లి లొ కనబడ్దాడు , కొత్తగా కొన్న బ్రష్ పెన్ చూపించా , నా స్కెచ్ బుక్లొ ఎప్పట్లాగే  తన దైన వూపులొ బొమ్మ గీశాడు ,దాని కింద  ఎప్పట్లాగే సంతకం మాత్రం పెట్లా.  ఇప్పుడు మన సంతకం విలువ లాక్స్ గురూ అంటూ చిద్విలాసంగ దమ్ములాగాడు

 బేళూరు హళేబీడ్ తిరిగొచ్చిన మత్తులొ  ఒసారి పొన్ చేసాడు పొన్ నిండా కన్నీల్లే,  "ఏం వర్క్ గురూ ఏం వర్క్ గురూ" అని గంట దాటింది , పొన్ వేడెక్కి చెవి చుర్రు మనేదాకా  వదలడే "ఏం వర్క్ గురూ ఏం వర్క్ గురూ" అంటూ.
చివరిసారిగా గత డిసెంబర్లొ కలిశా కార్టూనిస్ట్ జయదేవ్ గారి సభలొ , మూడేళ్ల కొడుకుని దర్జాగా భుజాల పై మోస్తూ తెచ్చాడు అచ్చం  తను గీసిన గరుడవాహన  పెయింటింగ్ మాదిరి , నన్ను చూడగానే "ఆరేయ్ నిన్ను కత్తితొ నరకాల్రా అన్నాడు , పొన్లే పాపం పెద్దాడు కదాని నేను నొరు మూసుకొవచ్చుకదా ఊహూ " నువ్వు కత్తి తీయక ముందే సత్తూర్ తొ నిన్ను ఖైమా కింద కొట్టేస్తా"  అన్నా " థూ నీతొ మాట్లాడకూడదు  గురూ అంటూ దూరం వెల్లిపొయాడు, నేనూ 'విషింగ్ ది సేం అనుకొని వుంటా'  కాని వీడి చివరి మాట , చివరి పద్యం, ఒక కన్ను చిన్నిగా చేసి నవ్వే చివరి నవ్వు ఇవేమీ చివరివని ఎన్నడూ అనుకొలేదు, అప్పుడప్పుడూ పాండుని పాపి అని తిట్టేవాడిని 44 ఏండ్లకే పొయినవాణ్ణి పాపిని ఎట్లా అవుతా గురూ అంటున్నాడు పాండు.